వాహ్.. కేసీఆర్.......
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకుని రెవెన్యూ డివిజన్ అధికారి వరకు పది జిల్లాల అధికార గణం మొత్తం కొలువు తీరిన వేదికలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రసంగంతో విస్మయ పరిచారు. గ్రామంలో డంప్ యార్డ్ మొదలుకొని తెలంగాణ వాతావరణం వరకు ప్రతి అంశంపై సాధికారికంగా ఆయన ప్రసంగించిన తీరు అధికారులను విస్తుపోయేట్టు చేసింది. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు అభివృద్ధి కేంద్రంలో నవ తెలంగాణపై సమావేశం నిర్వహించారు. కేసిఆర్ అధికారులకు కొత్తేమీ కాదు. గత 13 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడిగానే ఆయన వారిగా బాగా తెలుసు. ప్రత్యర్థులు, మీడియా ఆయనపై చేసిన ప్రచారం ఆధారంగా కేసిఆర్‌పై ఒక అంచనాకు వచ్చిన అధికారులు ఈ రోజు జరిగిన సమావేశంతో తమ ఆలోచనలను మార్చుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, జిల్లాల భౌగోళిక స్వరూపం, గ్రామాల్లో సమస్యలు విషయం ఏదైనా కావచ్చు సాధికారికంగా వాస్తవిక దృక్ఫథంతో ఆయన మాట్లాడిన తీరు అధికారులను ఆలోచనల్లో పడేసింది. ఉద్యమ నాయకుడు సరే పాలనపై ఆయను ఉన్న అనుభవం ఎంత? అవగాహన ఎంత? అనుకున్న కొందరు అధికారులు మా ఆలోచనలు మార్చే విధంగా కేసిఆర్ ఉపన్యాసం సాగిందని చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఇక్రిసాట్ హైదరాబాద్‌లో ఉందనే విషయం అధికారులందరికీ తెలిసిందే? కానీ అది హైదరాబాద్‌లోనే ఎందుకు ఉందో కేసిఆర్ వివరించిన తీరు అధికారులను విస్మయపర్చింది. ఎర్రరేగడినేల,నల్లరేగడి నేల కలిసి ఉన్న అరుదైన ప్రాంతం అది, విత్తనాభివృద్ధికి ప్రపంచంలోనే అరుదైన ప్రాంతం. అందుకే ఇక్కడ ఆ కాలంలోనే ఇక్రిసాట్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. పంచాయితీరాజ్ విధానాన్ని మనం నిర్వీర్యం చేశాం కానీ అసలైన లక్ష్యం ఏమిటో? అధికారులకు చెప్పుకొచ్చారు.స్వాతంత్య్రం లభించి ఆరు దశాబ్దాలు అవుతున్నా గ్రామానికి ఒక డంప్ యార్డ్ ఉండాలనే ఆలోచన మనకు కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లు తమ వద్దకు వచ్చే గ్రామీణులతో, కింద స్థాయి ఉద్యోగులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. వినడానికి చిన్న మాటగానే కనిపించవచ్చు. కానీ ఇంగ్లీష్‌లో మీరు ఏదో మాట్లాడితే వారు మీ వద్దకు రావడానికే జంకుతారు.తమదైన భాషలో మాట్లాడితే మీపై నమ్మకం పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. బ్రీటీష్ కాలం నాటి కలెక్టర్లుగా ఉండొద్దని, ప్రజాస్వామ్యంలో ప్రజల కలెక్టర్‌గా నిలవాలని వివరించారు. పాలనలో ,ప్రణాళిక రూపకల్పనలో అన్నింటిలో తెలంగాణ ముద్ర ఉండాలని చెప్పుకొచ్చారు. కొన్ని లక్షల మంది వచ్చిన బహిరంగ సభలోనైనా కేసిఆర్ అరగంటకు మించి మాట్లాడరు. 15-20 నిమిషాల్లోనే ఉపన్యాసం ముగించిన సభలు కూడా ఉన్నాయి.
అలాంటిది ఆయన తొలి సమావేశంలో రెండున్నర గంటల పాటు మాట్లాడారు. 11గంటలకు ప్రారంభం అయిన సమావేశంలో మధ్యాహ్నాం రెండున్నర వరకు ప్రసంగించి, మనం టీ బ్రేక్ తీసుకుందాం అనగానే పక్కన ఉన్న వారు లంచ్ టైం అయిందని గుర్తు చేశారు. దానికి కేసిఆర్ నవ్వుతూ నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, తెలంగాణ కోసం ఏం చేయాలని నేను కోరుకుంటున్నానో మీకు అర్ధం అయి ఉంటుందని అన్నారు. అంకెల కోసం కాగితాలను చూడకుండా అన్ని అంశాలపై అనర్ఘళంగా ప్రసంగించారు. ఇది ఉన్నతాధికారులకు తెలంగాణపై శిక్షణ కార్యక్రమంగా సాగింది. ముఖ్యమంత్రిగా కేసిఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఉన్నతాధికారులతో ఆయా శాఖల గురించి సమీక్షలు నిర్వహించడం తప్ప విస్తృతంగా సమావేశం నిర్వహించడం ఇదే మొదటి సారి. ఐఎఎస్ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు, రెవెన్యూ డివిజన్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కేసిఆర్ ఉపన్యాసం విన్నాక వాహ్ కేసిఆర్ వాహ్ అనుకోకుండా ఉండలేకపోయామని అధికారులు చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment