విద్యుత్ రంగంలో ఆంధ్రకు మహర్దశ
విద్యుత్ రంగంలో ఆంధ్రకు మహర్దశ పట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా కేంద్రం ఎంపిక చేసిన రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ క్రమంలో నిరంతర విద్యుత్ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరంతర సమీక్ష మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పైసా వెచ్చించాల్సిన పని లేకుండానే ఈ పథకాన్ని కేంద్రం అమలుచేస్తుంది. తొలిదశలో వెయ్యి కోట్లు వెచ్చించేందుకు అపుడే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. విద్యుత్ అదుపు- పొదుపుపై కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం రాష్ట్రానికి చేరుకుంది. కమిటీకి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసస్ లిమిటెడ్ చైర్మన్ సౌరభ్‌కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. సోమవారం విద్యుత్ సౌదాలో సుదీర్ఘ సమీక్ష అనంతరం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులను మెరుగుపర్చేందుకు రానున్న రెండేళ్లలో వెయ్యి కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. మరోపక్క ఈ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించారు.
ఇదిలావుంటే, విద్యుత్ సంస్థలను ఆర్ధికంగా, సాంకేతికంగా బలోపేతం చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ అందించాలనే ధృడ సంకల్పంతో రాష్ట్రం ఉంది. కరెంటు పొదుపునకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీపిసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇఆర్‌సి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ల భాగస్వామ్యంతో విద్యుత్ పొదుపు కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తక్కువ విద్యుత్‌తో ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా ఎల్‌ఇడి విద్యుద్దీపాల వ్యవస్థను ఆధునీకరించడం, నాణ్యమైన పంపుసెట్లను వినియోగించడం ద్వారా విద్యుత్ వృథాను అరికట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తొలిదశలో ఈ పథకాన్ని 24 మున్సిపాల్టీల్లో అమలు చేస్తారు.
భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, తుని, చీరాల, ఒంగోలు, నర్సారావుపేట, తెనాలి, నెల్లూరు, అనంతపురం, ధర్మవరం, గుంతకల్, తాడిపర్తి, హిందూపూర్, మదనపల్లి, తిరుపతి, కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూర్, గుంటూరులో అమలు చేస్తారు. విద్యుత్ పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షించారు. విద్యుత్ పొదుపు, సామర్థ్యం అంశాలపై కమిటీతో చర్చించి ప్రణాళికను ఖరారు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షల్లో ముఖ్యమంత్రి కార్యదర్శి జి సాయిప్రసాద్, ముఖ్యకార్యదర్శి డి సాంబశివరావు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఎండి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment